ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి అభివృద్ధిలో నాణ్యతా లోపాన్ని చిన్నపాటి వాన బయటపెట్టేసింది. పైన పటారం లోన లోటారంలా పనులు మమ అనిపించారని తేలిపోయింది. దీంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. యాదాద్రి పునర్నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై చర్చ మొదలైంది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణను ముసురు కమ్మేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతుండగా.. యాదాద్రిలో కూడా వాన పడింది. అయితే.. చిన్నపాటి వర్షానికే యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో క్యూలైన్ లోకి వర్షపు నీరు చేరడం చర్చనీయాంశంగా మారింది. లడ్డూ సెక్షన్ లోకి కూడా నీళ్లు చేరాయి.
వర్షానికి ఆలయ పరిసర ప్రాంతాల్లోనూ వరద నీరు చేరింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. గుట్ట నుంచి కిందకు వెళ్లే మార్గంలో వేసిన కొత్త రోడ్డు కుంగిపోయింది. సెకండ్ ఘాట్ రోడ్డు కొట్టుకుపోయింది. బస్టాండ్ ప్రాంగణం మొత్తం వరద నీటిలో మునిగింది.
ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు, అధికారుల పనితనంపై భక్తులు మండిపడుతున్నారు. చిన్న వర్షానికే క్యూలైన్, లడ్డూ కాంప్లెక్స్ లోని నీళ్లు చేరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటు గుట్ట కింద పలు కాలనీలు నీటమునిగాయి.