యాదాద్రిలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలయాన్ని పునఃనిర్మిస్తోంది. నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి మార్చి 28 నుంచి మూలవరుల దర్శనం కలిగించాలని భావించింది. అలాగే.. యాదాద్రి శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్ని మార్చి 21 నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. తాజాగా దాన్ని వాయిదా వేస్తున్నట్టు యాదాద్రి మండలి తెలిపింది.
కట్టడాలు పూర్తి కాకపోవడంతోనే శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో భాగంగా యాగాన్ని నిర్వహించాలని భావించారు.
గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్చి 28 నుంచే మూలవరుల దర్శనం ప్రారంభం అవుతోందని వెల్లడించారు. అయితే.. ఆలయ ఉద్ఘాటన తరువాత మహాయాగం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్ని నిర్వహించేందుకు త్వరలోనే మరో ముహూర్తం ఖరారు చేయనున్నట్టు వెల్లడించారు.
మహాకుంభ సంప్రోక్షణ పర్వం తర్వాత యాదాద్రి ప్రధానాలయంలోకి భక్తులకు అనుమతి ఉండనుందని పేర్కొన్నారు. అలాగే.. ఈ నెల చివరి వరకు ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపన చేయనున్నారని ఆలయ కమిటీ వెల్లడించింది.