యాదాద్రి : ఆనాడు యన్టీఆర్ యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి గుట్టపై అత్యంత భారీ బుద్ధ విగ్రహాన్ని చెక్కించారు. బుద్ధుని ఏకాశిలా విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ జిబ్రాక్టర్ రాక్‌పై ప్రతిష్ఠించేందుకు రాయగిరి నుంచి భారీ ట్రెయిలర్‌పై దాన్ని అట్టహాసంగా తరలించారు.
యన్టీఆర్‌ని అనేక విషయాల్లో ఫాలో అయ్యే కేసీఆర్ ఇప్పుడు యాదాద్రి లక్ష్మీ నారసింహుని ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మహా రాజగోపురం ప్రధాన ద్వారాన్ని అత్యంత ఖరీదైన టేకుతో తయారు చేయించి భారీ వాహనంలో తరలించారు. 1.5 టన్నుల బరువు, 23 అడుగుల ఎత్తు వున్నఈ ప్రధాన ద్వారం తలుపులపై 80 పద్మాలు చెక్కించారు. ప్రధాన ద్వారం తరలింపును జనం ఆసక్తిగా తిలకించారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాద్వారాలకు బిగించనున్నఈ తలుపులు యాదాద్రికి చేరుకున్నాయి. దాదాపు రూ.మూడు కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో వీటిని తయారు చేయించారు. సప్తతల రాజ గోపురానికి సంబంధించిన ఈ తలుపులను 24X14 అడుగుల సైజులో, మిగతా ఆరు గోపురాలకు 16X 9 అడుగుల సైజులో తయారుచేశారు.
ఓపక్క యూరియా కోసం రైతులు, మరోపక్క విష జ్వరాలతో సామాన్యులు క్యూలు కట్టిన దృశ్యాలు చూసి ఆందోళనతో వున్న జనం.. అత్యంత ఖరీదైన ఆలయ సింహద్వారాన్ని భారీ ట్రెయిలర్‌పై ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి కాస్త రిలీఫ్ ఫీలయ్యారు. సమస్యల్ని పట్టించుకోని పాలకులకు నీవే కనువిప్పు కలిగించు తండ్రీ.. అంటూ ఆ నారశింహుని వేడుకున్నారు.