ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కుల రాజకీయాలు తక్కువే. కానీ.. టీఆర్ఎస్ పాలనలో ఇవి ఎక్కువవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సిరిసిల్లలో వెలుగుచూసిన సంఘటనే అందుకు నిదర్శనమని చెబుతున్నాయి ప్రతిపక్షాలు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడి ఎంపికలో టీఆర్ఎస్ నేతలు కలగజేసుకుని హైడ్రామా క్రియేట్ చేశారని ఆ సంఘం నేతల నుంచి వినిపిస్తోంది.
ఇటీవల యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏటీ యాదవ్ ను వేములవాడలోనియాదవ సంఘం భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే.. టీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలు ఈ విషయంలో అలిగి.. సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో పోలీస్ పహారా మధ్య మిరాల భాస్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ముందస్తుగా కొంత మంది యాదవ సంఘం నాయకులను అరెస్ట్ చేయించి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారని విమర్శలు వస్తున్నాయి.
ఈ విషయంలో ఇదేంటని ప్రశ్నించిన యాదవ సంఘం సభ్యులతో పాటు ఒగ్గు కళాకారులను కల్యాణ మండపంలో అరెస్ట్ చేయించారు. ఈ నేపథ్యంలోనే భాస్కర్ ఎన్నిక చెల్లదంటూ యాదవ సంఘం సభ్యులు ప్రకటన చేశారు. అయినా.. కుల సంఘం ఎన్నిక.. పోలీసుల పహారా మధ్య జరగడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. మంత్రి మెప్పు పొందడం కోసమే ఇదంతా చేస్తున్నారా? అని సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులను, కుల సంఘ సభ్యులను అరెస్ట్ చేయించడం ఎంతవరకు సమంజసం. పార్టీలు మీకు శాశ్వతంగా ఉంటాయా? కులాన్ని తాకట్టు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒక స్టీరింగ్ కమిటీ వేసి. నామినేషన్ సమయం ప్రకటించి.. పద్దతి ప్రకారం ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీల కోసం పనిచేస్తే ఇప్పుడు ఒక పార్టీ ఉంటుంది.. రేపు మరో పార్టీ వస్తుంది.. కుల సంఘానికి రాజకీయ రంగు పులమొద్దు అంటూ సభ్యులు సూచిస్తున్నారు.