ఎవరు ఉంటారో… ఎవరు వెళ్తున్నారో.. అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. రోజుకొకరు ఆ పార్టీకి షాకులిస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత రాజ్యసభ ఎంపీలు, పలువురు అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులు పార్టీని విడిచి వెళ్లిపోగా.. తాజాగా మరో అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ క్యూలో నిలబడ్డారు. టీడీపీని వీడుతున్నట్టు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు కానీ.. పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు దాదాపుగా ఫిక్సయ్యారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఛాయాచిత్రాలు చెబుతున్నాయి.
బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణను కలిసి యామినీశర్మ ఒక గ్రూప్‌లో నిలబడి తీయించుకున్న ఫోటో వాట్సాప్ గ్రూపుల్లో బాగా సర్కులేట్ అవుతోంది. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న యామినీశర్మ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం గల విషయమే.
గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఆశించిన యామినీశర్మకు భంగపాటు తప్పలేదు. తెరవెనక ఎన్నివిధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ పార్టీ అధినేత అంతగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఎన్నికలకు ముందు పార్టీ తరఫున వాయిస్ వినిపించే బాధ్యతలు అప్పగించి ఆమె సేవల్ని వినియోగించుకోవడం తెలిసిందే. అనేక సందర్భాల్లో యామినీ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు కారణం అయ్యాయి. ఆమెకు చినబాబు మద్దతు ఉన్నట్టుగా మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత యామినీశర్మ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడామె బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపిందని, అందులోభాగంగానే కన్నాను కలిసిందని సమాచారం. త్వరలో యామినీ బీజేపీ పెద్దల సమక్షంలో కమలం తీర్ధం తీసుకుంటారని తెలుస్తోంది.