వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శులు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఇప్పుడే అవినీతి సొమ్మును జేబులో వేసుకుని.. వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలని ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని కోలుకోలేని అప్పుల ఊబిలోకి పడేసి.. ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని యనమల ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.7.76 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. జగన్ మరోసారి బహిరంగ మార్కెట్, కార్పొరేషన్ల రుణాలను తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని యనమల డిమాండ్ చేశారు. ఏపీని దుష్ట చతుష్టయం పట్టి పీడీస్తోందని, జగన్ తన పార్టీ గురించే ఆలోచిస్తున్నారు తప్పా.. ప్రజల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల మండిపడ్డారు.
ఏపీలో ఆదాయం లేక ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర దయనీయ స్థితికి జగన్ రెడ్డి బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మొండి బకాయిలను కేంద్రం ఎంతకాలం రక్షిస్తుందని యనమల నిలదీశారు. అవినీతి, అక్రమాలు, లూటీతో జగన్ సంపాదించిన సొమ్మును కేంద్రం బయటకు తీయాలని డిమాండ్ చేశారు.
45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని యనమల నిలదీశారు. కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద రైతులకు 12,500 ఇస్తానని, రూ.6,500 ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్షాలపై కేసులు పెట్టి వేధించడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు.