సెలక్ట్ కమిటీపై మండలి చైర్మన్ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలు తిరుగులేనివని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సెలక్ట్‌కమిటీపై రూలింగ్ ఇచ్చిన సమయంలో డివిజన్, ఓటింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. హౌస్‌లో ఉండే మెజార్టీ, సభ్యుల మూడ్ ఆధారంగా రూలింగ్ ప్రకటించే హక్కు చైర్మన్‌కు ఉంటుందని ఆయన వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 కింద చైర్మన్ అధికారాలను న్యాయస్థానాల్లో కూడా సమీక్షించే హక్కు లేదని, అలాంటప్పుడు చైర్మన్ నిర్ణయాన్ని సెక్రటరీ ఎలా ధిక్కరిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నేతలకు భద్రత తగ్గింపు ఉద్దేశపూర్వకంగా చేసిందే అని యనమల విమర్శించారు. అధికార పార్టీ నేతలకు మాత్రం భద్రత తగ్గించలేదని, దీనిపై శాసనమండలిలో చర్చిస్తామన్నారు. ఈ వ్యవహారంపై ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తామని యనమల రామకృష్ణుడు తెలిపారు.