రైతులను ఇబ్బంది పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి యావత్ రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టిందని ఆరోపించారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. యాదాద్రి భువనగిరిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇంత కాలం ధాన్యం కొనుగోలు సజావుగా సాగిందన్నారు. కానీ.. గత యాసంగి నుంచి కేంద్రం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తెస్తున్నామన్నారు. దీంతో పలు సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనా తీవ్ర సంక్షోభంలో కూడా రైతులకు మనోబలం కల్పించి రైతుల కల్లాల వద్దకే వెళ్లి.. టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందని అన్నారు.
గత సంవత్సరం కేంద్రం 1. 45 కోట్ల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసిందని.. గత యాసంగి నుంచి కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చిక్కులు పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పంటల ప్రణాళికపై సరైన పాలసీ లేదని విమర్శించారు. కేంద్రం రాష్ట్రాలతో సయోధ్యగా ఉండాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు సహకారం ఉండాలన్నారు.
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి టన్నుకు రూ.300 నష్టం వస్తున్నప్పటికీ.. రైతుల క్షేమం కోసం భరిస్తూ వచ్చామని తెలిపారు. కేంద్రం వైఖరి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మంత్రి. గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో యాసంగి వరిపంటను కూడా.. దాన్యం కొనుగోలు కేంద్రాల ద్యారా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి.