దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ 2 ట్రయిలర్ వచ్చేసింది. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రయిలర్ అదిరిపోయింది. అయితే ట్రయిలర్ ఎంత హిట్టయిందో, ట్రయిలర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన హీరో యష్ స్పీచ్ కూడా అంతే హిట్టయింది. లాంఛ్ సందర్భంగా చాలామంది ప్రముఖులు మాట్లాడినప్పటికీ.. యష్ మాట్లాడిన తీరు, అతడి మాటలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
యష్ స్పీచ్ లో అందర్నీ ఎట్రాక్ట్ చేసిన అంశం అతడి నిజాయితీ. కేజీఎఫ్ సక్సెస్ ను తన ఖాతాలో వేయొద్దంటున్నాడు ఈ హీరో. ఆ సినిమా సక్సెస్ పూర్తిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కే దక్కుతుందని చెబుతున్నాడు. చాలామంది కేజీఎఫ్ సక్సెస్ అయినందుకు తనకు ధన్యవాదాలు తెలుపుతున్నారని, అది తప్పు అని అన్నాడు.
కనీసం ఆ సక్సెస్ ను యష్-ప్రశాంత్ నీల్ జాయింట్ సక్సెస్ అనడానికి కూడా యష్ అంగీకరించలేదంటే అతడి నిజాయితీని అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సినిమాలు చేసినట్టుగానే కేజీఎఫ్ కూడా చేశానని, ఇది అంత పెద్ద హిట్టయిందంటే దానికి ప్రశాంత్ నీల్ టాలెంట్ కారణమని యష్ చెప్పుకొచ్చాడు.
ఇక కేజీఎఫ్ 2, విజయ్ నటించిన బీస్ట్ సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడంపై కూడా స్పందించాడు యష్. విజయ్ తో పోలిస్తే తను చాలా చిన్న వాడినని, అతడితో తనను పోల్చవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. తప్పనిసరి పరిస్థితుల మధ్య బీస్ట్ తో పాటు కేజీఎఫ్-2ను విడుదల చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్ ను కన్నడ ప్రైడ్ గా చెప్పుకొచ్చిన యష్.. పార్ట్-2 మరింత బాగుంటుందని చెప్పుకొచ్చాడు.