– నగరంలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం
– 14న చనిపోతే.. 15 కూడా బిల్లు
– యశోద ఆస్పత్రిపై సర్వత్రా విమర్శలు
ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే జరిగే దోపిడీకి నిదర్శనం ఈ ఘటన. పైగా జరిగింది.. నగరంలోనే బాగా ఫేమస్ యశోద హాస్పిటల్స్ లో. విషయం బయటకు పొక్కడంతో ఇప్పుడా ఆస్పత్రి నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మలక్ పేటలోని యశోద ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం రమ్య అనే యువతిని జాయిన్ చేశారు కుటుంబసభ్యులు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందించారు. కానీ, ఫలితం లేకపోయింది. ఈనెల 14న యువతి చనిపోయింది. ఆ విషయాన్ని వెంటనే ఆస్పత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు తెలియజేశారు. డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.
అయితే.. బిల్లు మాత్రం 15వ తారీఖు కూడా వేసి ఇచ్చారు. కుటుంబసభ్యులు కూడా డీటెయిల్స్ చూసుకోకుండానే మొత్తం బిల్లు రూ.6 లక్షలు ఆస్పత్రికి సమర్పించారు. తాజాగా బిల్లుల్ని పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. డెత్ సర్టిఫికెట్ లో 14న చనిపోయిన యువతికి 15న రకరకాల టెస్టులు చేసినట్లు బిల్లులో ఉంది. అదిచూసి కుటుంబసభ్యులు షాకయ్యారు.
బాధిత కుటుంబానికి జరిగింది.. బంధువుల్లో ఒకరు తొలివెలుగుకు వివరించారు. బిల్లులు, డెత్ సర్టిఫికెట్ ఆధారాలను కూడా పంపించారు. నగరంలో ప్రముఖ ఆస్పత్రిగా చెప్పుకునే యశోద ఆస్పత్రిలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.