సినీ నటుడు వేణుమాధవ్ తుది శ్వాస విడిచే వరకు సమాచారాన్ని అందించడంలో ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని మీడియావర్గాలు అంటున్నాయి. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడంలో యశోదా ఆసుపత్రి యాజమాన్యం పట్టనట్టుగా వ్యవహరించింది. కిడ్నీ సంబంధిత సమస్యలతోతీవ్ర అస్వస్థతకు లోనయిన వేణుమాధవ్‌ను నిన్న సాయంత్రం సికింద్రాబాదులోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచేంత వరకు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఆసుపత్రి వర్గాలు తెలియజేయలేదు. తన ఆరోగ్య పరిస్థితిపై వేలాది మంది అభిమానులు కలవరపడతారని తెలిసినా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయలేదు. వేణుమాధవ్ శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిపడుతున్నారని మాత్రమే సమాచారాన్ని, అది కూడా ఉదయం 11.20 గంటలకు ఆసుపత్రిలోవున్న తొలివెలుగు ప్రతినిధి రాకేశ్ ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. రెండు కిడ్నీలు చెడిపోవటంతో డయాలసిస్ చేశారు. బీపీ లెవల్స్ 40-50కి పడిపోయాయి. ఐతే ఈ వివరాలు ఏవీ డాక్టర్లు చెప్పలేదు. హెల్త్ బులెటిన్లు ప్రత్యేకంగా ఇవ్వనవసరం లేదని, మీడియాకు సమాచారం ఇస్తే చాలునని ఆసుపత్రి మేనేజ్మెంట్ చెప్పినట్టు సమాచారం. అదే ఓ మోస్తరు హీరో, లేదా పొలిటీషియన్ అయితే పెద్ద హడావుడి చేసే కార్పొరేట్ ఆసుపత్రులు ఇలా చిన్న ఆర్టిస్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అభిమానులు మండిపడ్డారు.