సమంత లీడ్ రోల్ పోషించిన యశోద సినిమా థియేటర్లలో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈనెల 9వ తేదీన స్ట్రీమింగ్ కు వస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది. యశోదకు సంబంధించి ముందుగా క్లోజ్ అయిన బిజినెస్ ఇదే. టోటల్ ఇండియా స్ట్రీమింగ్ రైట్స్ ను దాదాపు 30 కోట్ల రూపాయలకు అమెజాన్ దక్కించుకుంది. ఈ మొత్తం చాలా ఎక్కువ. కాకపోతే ఫ్యామిలీ మేన్ తో సమంత బాలీవుడ్ కు కనెక్ట్ అయింది. ఆ తర్వాత పుష్ప ఐటెంసాంగ్ తో కూడా బాలీవుడ్ జనాలు బాగా లైక్ చేశారు. దీంతో యశోదకు మంచి రేటు పలికింది.
9వ తేదీన తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కు వస్తోంది యశోద సినిమా. నిజానికి ఈ సినిమా ఇంకాస్త ముందే అమెజాన్ లో రావాల్సి ఉండగా, కాస్త ఆలస్యమైంది.
ఈ సినిమాపై కోర్టు కేసు పడింది. తమ సంస్థ పేరును తప్పుగా వాడారంటూ ఇవా సంస్థ కోర్టులో కేసు వేసింది. తమ గౌరవానికి భంగం కలిగించేలా సంస్థ పేరును వాడారనేది వాళ్ల ఆరోపణ. దీనిపై నిర్మాత వెంటనే స్పందించాడు. ఆ పేరును పూర్తిగా తొలిగించామని స్పష్టం చేశాడు. ఈ మార్పుచేర్పులు పూర్తయిన తర్వాత సినిమా ఓటీటీలోకి వస్తోంది.