విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయన్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన సమావేశంలో యశ్వంత్ సిన్హాను ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.
యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాలని అన్ని రాజకీయ పార్టీలకు తాము విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలను జూలై 18న నిర్వహించనున్నారు.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ముగ్గురి పేర్లు ఇటీవల ప్రముఖంగా వినిపించాయి. అయితే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, బెంగాల్ మాజీ గవర్నర్, గాంధీ ముని మనవడు గోపాల కృష్ణల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో పోటీకి ఆ ముగ్గురు ఆసక్తి చూపించలేదు.