తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ఏపీలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికల విజయంతో మంచి ఊపు మీదున్న అధికార వైసీపీ.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన చేసింది. ఇక జనసేన- బీజేపీ ఇప్పటికే ఈ ఉప ఎన్నికపై ఓ అవగాహనకు వచ్చాయి. తిరుపతి బరిలో బీజేపీ తరపు అభ్యర్థిని నిలిపేందుకు రెండు పార్టీలు నిర్ణయించాయి.
తిరుపతి ఉప ఎన్నికకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది. కాగా తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో చనిపోవడంతో.. ఉప ఎన్నిక అనివార్యమైంది. తొలుత ఆయన కుమారుడు కల్యాణ్ చక్రవర్తికి టికెట్ ఇవ్వాలని వైసీపీ భావించింది. అయితే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది. దీంతో డాక్టర్ గురుమూర్తిని లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించేందుకు మార్గం సుగమమైంది.