పైకి కేసీఆర్ గారు చిటపటలాడతారు. దుమ్ము కొట్టుకుపోతారంటూ శాపనార్ధాలు పెడతారు. అటు నుంచి అంత డైరెక్ట్ అటాక్ లేకపోయినా.. రాయలసీమకు నీళ్లు ఇవ్వనివ్వరా అంటూ విరుచుకుపడతారు. ఇద్దరూ ఒక్కప్పుడు కౌగలించుకున్నా.. పైకి మాత్రం కొట్లాడుకుంటున్నట్లే ఫోజులు పెడతారు. కాని గ్రేటర్ ఎన్నికలు అవన్నీ డ్రామాలేనని తేల్చేశాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. వైసీపీకి అసలు బలం లేకుండా పోలేదు. సామాజికవర్గం రీత్యా రెడ్లు వైసీపీకి మద్దతిస్తారు.. కొన్ని పాకెట్లలో రెడ్ల ఓట్లు బాగానే ఉన్నాయి.. అలాంటి చోట వైసీపీ పోటీ చేయొచ్చని.. ఆ పార్టీని నమ్ముకున్న కొందరు భావిస్తున్నారు. కాని అలాంటి ఛాన్సేమీ లేదని.. ఆ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తేల్చేశారు.
ఎందుకంటే వారింకా ఫ్యూచర్ ప్లాన్లు ఆలోచించుకునే దశలో ఉన్నారు.. టైమ్ పడుతుందంట.. అందుకని పోటీ చేయరంట. వీళ్ల కంటే పవన్ నయం.. కనీసం పోటీ చేద్దామనుకున్న బిజెపి కోసమే చేయడం లేదని ఓపెన్ గా చెప్పాడు. వీళ్లు మాత్రం టీఆర్ఎస్ కోసం పోటీ చేయకుండా పక్కకు తప్పుకుని.. ఇప్పుడు వేరే కారణాలు వినిపిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు.. 2014 నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు ఓట్లు చీల్చేవాడు కావాల్సి వచ్చింది.. అందుకని.. ముందు పోటీ లేదన్న వైసీపీ రాత్రికి రాత్రి నామినేషన్లు వేయించింది తెలంగాణలో. ఖమ్మం ఎంపీ సీటుతో పాటు ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. కాని తర్వాత వారంతా టీఆర్ఎస్ లోనే చేరటంతో.. అసలు ప్లాన్ ఏంటో అర్ధమైపోయింది.
ఇక ఆ తర్వాత ఏ ఎన్నిక జరిగినా పక్కకు తప్పుకోవడం వైసీపీకి అలవాటైపోయింది. ఇప్పుడయితే మరీ కీలకం. ఎందుకంటే ఒక వేళ బిజెపి గెలిచిందంటే.. ఏపీలో కూడా తొడగొడుతుంది. సోము వీర్రాజు మనోడు అయినా.. ఎప్పుడైనా బిజెపి జాతీయ నాయకత్వం టైమ్ చూసి ఆయనను కూడా తప్పించిందంటే.. జగన్ కు కష్టాలు మొదలవుతాయి. అందుకే బిజెపి గెలవకూడదని.. టీఆర్ఎస్ కే పని చేయాలని వైసీపీకి డైరెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా సోషల్ మీడియా వింగ్ కూడా టీఆర్ఎస్ విజయం కోసమే పని చేస్తున్నట్లు సమాచారం.
అలా ఏమీ లేదంటూనే.. బిజెపి ఓటమి కోసం వైసీపీ పని చేస్తోంది. ఏపీలో స్నేహం.. తెలంగాణలో వైరం.. అన్నీ అవసరాల కోసమే తప్ప.. ఏదీ మనస్ఫూర్తిగా చేయటం లేదు. ఎవరు ఎప్పుడైనా కలిసిపోవచ్చు.. రాజకీయ అవసరాల కోసం. ప్రస్తుతం అయితే బిజెపి ఓటమి కోసం…టీఆర్ఎస్ గెలుపు కోసం వైసీపీ పని చేస్తుందనడంలో సందేహం లేదు. పైగా హైదరాబాద్ చాలా కీలకం. ఇక్కడ ఉన్న ఆస్తులను కాపాడుకోవటానికైనా కేసీఆర్ కు సహకరించక తప్పని పరిస్ధితి. బిజెపితో వెళ్లినా ప్రొటెక్షన్ దక్కుతుంది.. ఇప్పటికే వారి దృతరాష్ట్ర కౌగిలిలోకి సగంపైనే వెళ్లిన జగన్.. ఇంకా దూరాలంటే భయపడుతున్నాడు.