ఆంధ్రప్రదేశ్‌లో కియా మోటార్స్ ఏర్పాటుపై వైసీపీ మాట మార్చింది. చంద్రబాబు హయాంలో దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒక కారును కూడా విడుదల చేశారు. అయితే అప్పట్లో ఈ పరిశ్రమ ఏర్పాటును వైసీపీ విమర్శించింది. కియా కార్లు అమ్ముడుపోకపోవడంతో చైనాలోని ఫ్లాంట్లను కియా మూసేశారంటూ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కక్కుర్తితోనే కియాకు చంద్రబాబు రూ. రెండువేల కోట్ల రాయితీలు ఇచ్చారని కూడా విజయసాయి ట్విట్టర్‌లో ఆరోపించారు. కియా ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పకనే చెప్పారు.
అయితే ఎన్నికల తర్వాత వైసీపీ మాట మార్చింది. 12ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు కోసం వైఎస్ కృషి చేశారని వైసీపీ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి కియా సీఈవో రాసినట్టు చెప్పిన లేఖను కూడా మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి విడుదల చేశారు.