అంతర్వేది వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా అనిపించటం లేదు. బిజెపి, జనసేనలు వాతావరణాన్ని ఇంకా వేడెక్కించే పనిలోనే ఉన్నారు. ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. మరోవైపు వైసీపీ నేతలు వివరణలు ఇచ్చుకుంటూనే ఉన్నారు. బిజెపి, జనసేనలతో ట్యూన్ అవుతూ టీడీపీ నేతలు సైతం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే.. వైసీపీ నేతలు ఇప్పటికి టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ ల మీద విమర్శలు చేస్తున్నారు.. సవాళ్లు విసురుతున్నారు తప్ప.. అసలు ఆందోళనలు చేస్తున్న బిజెపి, జనసేనలను మాత్రం అలా టచ్ చేసి వదిలేస్తున్నారు.
అంబటి రాంబాబు మాట్లాడినా.. బొత్స సత్యనారాయణ మాట్లాడినా అందరూ.. చంద్రబాబు, లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఘటనల గురించి చెబుతున్నారు. గోదావరి పుష్కరాల దుర్ఘటన గురించి గుర్తు చేస్తన్నారు. అంతే కాని.. బిజెపి ఇలా చేయడం కరెక్టు కాదు.. జనసేన ఇలా మాట్లాడటం సరైంది కాదు.. వారు మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టాలని చూస్తున్నారని గాని.. వారు అనవసరంగా ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని గాని.. అనడమే లేదు. పైగా కొంతమంది.. ప్రతిపక్షాలు ఇలాంటి పదాలు తప్ప.. వారి నోటి వెంట బిజెపి, జనసేన పేర్లు రావడం లేదు.
అన్నిటిని మించి.. అంతర్వేది ఘటనలో కుట్రకోణం ఉందని.. దాని గురించి ఎంక్వయిరీ చేయాలని.. అసలు వీటన్నిటి వెనక చంద్రబాబు ఉన్నాడని తమకు అనుమానం ఉందంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. అంతెందుకు.. మొన్న నిరసనలకు బిజెపి, జనసేన పిలుపిస్తే.. టీడీపీ నేతలను కూడా గృహ నిర్బంధంలో పెట్టేశారు. ఇప్పుడు ఏకంగా బిజెపి, జనసేన చలో అంతర్వేదికి పిలుపు ఇచ్చాయి. నేరుగా పవన్ కల్యాణే ఈ విషయం ప్రకటించారు.
దీంతో వైసీపీ నేతల్లో గుబులు పెరిగింది. ఇదేదో ఇప్పట్లో చల్లారేలా లేదు. అవసరమైన చోట సాయం చేస్తూ.. వారికి అవసరమైన చోట ఆటాడుకుంటున్నారని.. బిజెపి గురించి వైసీపీకి అర్ధమవుతూనే ఉంది. అయినా ఏం చేయలేకపోతున్నారు. మతపరమైన సెంటిమెంట్ కావడంతో అంతర్వేది వ్యవహారంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్ధం కాక .. ప్రభుత్వాధినేతలు తలలు పట్టుకుంటున్నారు.
పైగా అంతర్వేది ఘటనపై గట్టిగా విచారణ చేస్తే.. బయటికి వచ్చేది.. తమ పార్టీ నేతలు కావడంతో.. దానిపైనా నోరు మెదపలేకపోతున్నారు. పిచ్చోడు, తేనెపట్టు.. ఇలాంటి ఎన్ని చెప్పినా.. ది ఎండ్ కార్డ్ వేయలేకపోయారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ వారే కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. ఇంత చేసినా.. బిజెపి, జనసేన నేతలపై మాత్రం ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు.
దొరికిందే సందన్నట్లు.. బిజెపి మాత్రం.. అంతర్వేదిలో చెలరేగిపోవడమే కాకుండా.. దానిని అడ్డుపెట్టుకుని.. రాష్ట్రమంతా మతపరమైన సెంటిమెంట్లు ఎక్కడ వీలైతే అక్కడ రెచ్చగొట్టాలనే ప్లానులో ఉంది. అలా చేస్తేనే… తాము రాజకీయంగా బలపడతామనేది వారి ఫార్ములా.. ఈ ఫార్ములా ఇప్పటికే వారు చాలా చోట్ల అమలు చేసి సక్సెస్ అయ్యారు. అసోం, పశ్చిమబంగ్ల, త్రిపుర లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో వారి సక్సెస్ వెనక ఫార్ములా ఇదే. ఇప్పుడు అదే రూటులో దూసుకుపోతున్నారు. కాని వైసీపీ పార్టీ గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని.. దీనిని ఎలా టాకిల్ చేయాలో తెలియక తికమకపడిపోతూ.. కంగారుపడుతున్నారు.