గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ప్రతీ ఇంటికి వెళ్తున్న వైసీపీ నేతలకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. మంత్రులను సైతం సమస్యలపై నిలదీస్తున్నారు. తాజాగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు చేదు అనుభవం ఎదురైంది. ఆలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో రోడ్డు ఎందుకు వేయలేదని ఓ మహిళ ప్రశ్నించింది. తర్వాత తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు నిలదీశారు.
ఇటు మరో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ దీ ఇదే పరిస్థితి. రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీ పనులకు డబ్బులు రావడం లేదంటూ హెచ్ కొట్టాలకు చెందిన మహిళలు ఫైరయ్యారు. దీంతో.. అధికారులపై కాసేపు కేకలు పెట్టిన బుగ్గన.. వారంలో పడతాయని చెప్పి అక్కడినుంచి జారుకున్నారు.
హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ అయితే మరీ ఘోరం. వారిద్దరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించమని అడిగితే పట్టించుకోలేదట. రోడ్డు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్నా వినకుండా వెళ్లిపోయారంట ఇద్దరు నేతలు. మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
పలుచోట్ల అమ్మ ఒడి డబ్బులు రావడం లేదని వైసీపీ నేతలను నిలదీస్తున్నారు ప్రజలు. అమ్మఒడి రాకపోయినా పర్లేదు.. కనీసం రోడ్లు అన్నా వేయండని అడుగుతున్నారు. మొత్తానికి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం వైసీపీ నేతలకు తలనొప్పిగా తయారైంది.