‘‘ఆడ మన్ను కూడా కాలేదు. మాటలు చెబితే అయితదా.. ఆళ్లు కమిటీ యేశారు అంతే‘‘, ‘‘వాళ్లు ప్రామిస్ చేశారు.. అందుకని ఏదో వాళ్ల ప్రయత్నం ఏదో వాళ్లు చేసుకుంటున్నారు’’ ఇవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దోస్తు తెలంగాణ సీఎం కేసీఆర్ గారి పలుకులు. అవి కూడా మీడియాతో ఓపెన్ గా పలికినవి. ఆర్టీసీ విలీనం మీదే.. ఈ మాటలు. తెలంగాణలో కేసీఆర్ అహంకారంతో కార్మికులపై కాలు దువ్వుతున్నారనేది పక్కన పెడితే.. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? కేసీఆర్ అన్న మాటల వెనక మర్మమేంటి?
తాము సర్కారు ఉధ్యోగులం అయిపోయామని ఆర్టీసీ కార్మికులు సంతోషపడుతున్నారు. ఆ పని చేసిందుకు జగన్ ను అభినందుస్తన్నారు. కాని దీని వెనుక అసలు ఆర్టీసీయే లేకుండా చేసే కుట్ర జరుగుతోంది. ఛార్జీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకుని.. జనం నడ్డి విరిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పుడున్న ఆర్టీసీ కార్మికులు సర్కారు పెన్షన్లతో రిటైరైపోతారు. కొత్తగా ఒక్క ఉద్యోగి కూడా రారు. ఇప్పుడున్నవారితోనే ఆర్టీసీ చరిత్ర ముగిసిపోనున్నది. మొత్తం ప్రైవేటు బస్సులతోనే.. అది కూడా ప్రస్తుతం ఆర్టీసీ చేతిలో ఉన్న ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను వాడుకుంటూనే వ్యవస్ధ నడవనున్నది. సామాన్యుల బడ్జెట్ రవాణాకు సంబంధించి తారుమారు కావడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఆర్టీసీ విలీనం అనేది టెక్నికల్ గా కుదరదనేది ఉన్నమాటే. నిపుణుల కమిటీ అదే చెప్పింది. ఆర్టీసీ విలీనం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. అది కూడా నీతి అయోగ్ ఆమోదిస్తేనే ఒప్పుకోవాలి. ఇప్పటికే కాలుష్యం నివారించాలి.. అది నివారించాలంటే ఎలక్ట్రికల్ బస్సులు పెట్టుకోవాలి.. అవి పెట్టే ఓపిక మన ఆర్టీసీలకు లేదు.. కాబట్టి ప్రైవేటోళ్లను పెట్టుకోవాలి.. దానికి సబ్సిడీ మేమిస్తాం అంటూ కేంద్రం క్లియర్ గా చెప్పేసింది. ఇది ఏపీ ప్రభుత్వానికి బాగా నచ్చింది. ఒకవైపు విలీనం అంటూ ఆర్టీసీ కార్మికులు జగనన్నను దేవుడుగా చూసుకుంటారు. ఇది రాజకీయంగా లాభం. మరోవైపు ఎలక్ట్రికల్ బస్సుల దందాలోకి మనోళ్లను ఎంటర్ చేయిస్తే.. వ్యాపారపరంగా లాభం. ఇదీ ఇప్పుడు కాన్సెప్ట్ అనే ఆరోపణలు వినపడుతున్నాయి.
తెలంగాణలో 34 బస్సులకు టెండర్ వేసిన మేఘావారే.. ఏపీలోనూ వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులన్నీ తమవే కావాలనే వ్యూహంలో వారున్నారు.
ఓ యూనియన్ నాయకుడు చెప్పిన ప్రకారం ‘‘ఆ బస్సులను నడిపే ఉద్యోగులు కూడా వారి కంపెనీవారే ఉంటారు. అన్ని బస్సులు ఎలక్ట్రికల్ బస్సులతో రీప్లేస్ చేశాక.. ఆర్టీసీ కార్మికులకు పని ఉండదు. ఉన్నవాళ్లకు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్, ఆర్ అండ్ బీ ఇతర సంస్థల్లో సర్దేస్తారు. ఇప్పటికే ఆర్టీసీ పేరు మార్చి ప్రజారవాణా సంస్థ అనే పేరుతో కొత్తది తెస్తున్నారు. ఈ సంస్థ ప్రైవేటు కంపెనీలకు ఫెసిలిటీస్ కల్పించటానికే తప్ప, బస్సులు నడపటానికి కాదు. ఇక ప్రైవేటు బస్సుల ధరలు నిర్ణయించడానికి ట్రాయ్ లాంటిదాన్ని పెడతారు. ఇక ఎప్పటికప్పుడు ఛార్జీలు పెంచుకుంటారు. అది తమకు సంబంధం లేదని ప్రభుత్వం రాజకీయంగా తప్పుకుంటుంది. ఎటొచ్చీ భారం పడేది ప్రజల మీదే. కాని ఇవే ప్రైవేటు కంపెనీలు.. ప్రజల ఆస్తులైన ఆర్టీసీ ఆస్తులను మాత్రం ఎంచక్కా వాడుకుంటాయి’’.
ఇలా వైసీపీ ప్రభుత్వం ఒకవైపు విలీనం పేరుతో కార్మికులను సంతోషపెడుతూనే.. ఎలక్ట్రిక్ బస్సుల దందాలో అస్మదీయులను దింపే వ్యూహం నడిపిస్తోంది. ఆర్టీసీ వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని.. మరోవైపు కార్మికులతో మాత్రం దండాలు పెట్టించుకునే దిశగా నడుస్తోంది.