చంద్రబాబు ఇసుక దీక్షపై దృష్టిమరల్చేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందా…? ఇసుక కృత్రిమ కోరత సృష్టిస్తున్నారు అని చెప్పే ప్రయత్నం జరుగుతోందా…? ప్రతిపక్షాలపైకి నేపం నెట్టేసి చేతులు దులుపుకునే ఎత్తుగడలు వేశారా…?
పై ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది. ప్రతిపక్షాలు, భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వంపై… ప్రభుత్వ ఇసుక పాలసిపై అనేక ఆరోపణలు చేస్తున్నా, వరదల కారణంగానే ఇసుక కొరత ఉందని సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇక రాష్ట్రంలో ఇసుక రాజకీయం ఎక్కువవటం, పవన్ లాంగ్ మార్చ్ పేరుతో విమర్శలు-ప్రతి విమర్శలతో హీటెక్కాయి ఏపీ పాలిటిక్స్. వీటికి తోడు చంద్రబాబు కూడా దీక్షకు సిద్ధమవటంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు దీక్షకు ఒక్కరోజు ముందు వైజాగ్‌లో బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థపై సిఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇసుక సరఫరా వెబ్‌సైట్‌ను హ్యక్ చేసి, ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని… ఈ సంస్థ గతంలో ఇసుక సరఫరా వెబ్‌సైట్‌ను నిర్వహించేదని ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ నారా లోకేష్ సన్నిహితులదని.. టీడీపీయే దీని వెనుక ఉందని చెప్పే ప్రయత్నం చేసిందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఇన్నాళ్లు సమయం కోసం వేచి ఉన్నట్లుగా… చంద్రబాబు దీక్ష రోజే టీడీపీ నుండి యువనేత దేవినేని అవినాష్‌ను వైసీపీలోకి ఆహ్వనించటం కూడా రాజకీయంగా ఓ ఎత్తుగడే అని విశ్లేషిస్తున్నారు. టీడీపీపై ఇది ఓ రకంగా మైండ్ గేమ్ అని, అందుకే చంద్రబాబు దీక్షకు పోటీగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి కూడా దీక్ష చేయటం అని అభిప్రాయపడుతున్నారు.
ఇసుక రాజకీయంలో కురుకపోయిన సీఎం జగన్, ప్రభుత్వం… ప్రతిపక్షాల విమర్శల నుండి తప్పించుకోవడానికి రాజకీయ ఎత్తుగడలు వేస్తుండొచ్చు కానీ… భవన నిర్మాణ కార్మికులను మోసం చేయలేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.