ఏపీలో వైసీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ పనుల టెండర్లు, ఇతర విషయాల్లోనూ తలదూర్చుతున్నారు. తాము చెప్పినట్లు వినాలని లేకపోతే.. అంతే సంగతులు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు, అధికార పార్టీకి చెందిన నేత జయరామిరెడ్డి రెచ్చిపోయాడు. రాయదుర్గం-కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించాడు.
ఎమ్మెల్యేను కలవకుండా పనులు ఎలా చేస్తారంటూ దుర్భాషలాడాడు జయరామిరెడ్డి. వెంటనే ఆపాలని.. లేదంటే భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించాడు. జయరామిరెడ్డి వీడియో సోషల్ మీడియాలో ఫార్వార్డ్ అవుతోంది. దీంతో ప్రతిపక్షాలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతోంది. జిల్లాలవారీగా దెబ్బతిన్న రోడ్ల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది. ఇలాంటి సమయంలో రోడ్డు పనుల్ని నిలిపివేయాలంటూ వైసీపీ నేత హల్ చల్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.