భల్లాలదేవుడిలా ఎంతటి బలవంతులనైనా కొమ్ములు విరిచేయొచ్చని అనుకుంటున్నారు. కాని ఆ భల్లాలదేవుడే బాహుబలి చేతిలో మట్టికరిచాడనే సంగతిని మర్చిపోతున్నారు. అందుకే భల్లాలాగే తెగించేశారు. మామూలుగా కాదు.. దేనికైనా రెడీ అన్నట్లే తెగించేశారు. తామనుకున్నది చేసుకోవడానికి.. రాజకీయ ఎత్తుగడల కోసం… న్యాయవ్యవస్ధనే ఢీకొట్టడానికి సిద్ధపడిపోయారు. వైసీపీవారు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. రెచ్చిపోతున్నారు. ఒక వ్యూహం ప్రకారం ఏపీ హైకోర్టును బదనామ్ చేయడానికి నడుం కట్టారు.
గతంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేసేవారు. అంటే ఇన్ డైరెక్టుగా సెటైర్లు వేసేవారు. తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారం నేరుగానే కామెంట్స్ చేశారు. అసలు మాకు అడ్డం పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు సజ్జల తదితరులు.. ఆత్మపరీశీలన చేసుకోవాలని.. అలా ఇలా అంటూ కాస్త అటు ఇటూగానే మాట్లాడారు. కాని ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడిన తీరు చూస్తుంటే మాత్రం.. కావాలనే హైకోర్టును టార్గెట్ చేశారని అర్ధమైపోతుంది. వారి ఉద్దేశం.. వారి ప్రచారాన్ని నమ్మి జనం హైకోర్టును తిట్టుకోవాలి.. హైకోర్టు ఇచ్చే ఆదేశాలన్నీ వైసీపీని అడ్డుకోవటానికే చేస్తున్నారన్నట్లు.. వారు ఒక సామాజికవర్గానికే మద్దతిస్తున్నట్లు.. వారేదో చంద్రబాబు లాబీయింగ్ లో ఉన్నట్లుగా జనం అనుకోవాలి.. కోర్టులను సైతం వారు తిట్టాలి.
అందుకే పార్లమెంట్ లో సైతం వారి కామెంట్స్ రికార్డయ్యేలా ప్లాన్ చేసి.. కరోనాపై చర్చ జరుగుతుండగా.. సడెన్ గా విజయసాయిరెడ్డి తన ప్రసంగంలో ఈ సబ్జెక్టును ఎత్తుకుని.. నేరుగా హైకోర్టు అసాధారణ రీతిలో నిర్ణయాలు తీసుకుంటుందని.. మీడియాపై సైతం నిషేధం విధిస్తుందని.. అది తీసుకునే నిర్ణయాలకు సహేతుక కారణేలవీ కనిపించటం లేదంటూ చెప్పుకొచ్చారు. ఇలా డైరెక్టుగా న్యాయస్థానంపై ఎంపీ కామెంట్స్ చేస్తుండటంతో.. మిగిలిన సభ్యులంతా అవాక్కయ్యారు. డిప్యూటీ ఛైర్మన్ పదే పదే అబ్జెక్ట్ చేసినా సరే.. విజయసాయిరెడ్డి తాననుకున్నది పూర్తిగా చదివేవరకు ఆగలేదు. మరోవైపు టీడీపీ ఎంపీ కడకమేనల రవీంద్ర కుమార్ సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేచి నిలబడ్డారు.
మొత్తం మీద వైసీపీ తాననుకున్నది చేసుకుంది. తమ రాజకీయాల కోసం చివరకు రాజ్యాంగబద్ధమైన అధికారాలున్న న్యాయవ్యవస్ధను సైతం ఓ దోషిగా ప్రజల ముందు చిత్రీకరించడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇది ఎటు దారి తీస్తుందో.. ఏ పరిణామాలకు కారణమవుతుందోనని మేధావులు, రాజకీయ విశ్లేషకులు టెన్షన్ పడుతున్నారు. ఎవరెంత ఆలోచించినా.. ఎవరెంత ఆందోళనపడినా.. జగన్..తనకు 151 మంది ఎమ్మెల్యేలనివ్వడమంటే.. సంపూర్ణ అధికారం ఇచ్చినట్లే… కాబట్టి తానే నిర్ణయం తీసుకున్నా అది అమలు జరగాల్సిందే.. దానికి రూల్స్ అడ్డం వస్తాయా.. నిబంధనలు ఒప్పుకుంటాయా.. రాజ్యాంగం అనుమతిస్తుందా.. ఇవేమీ పట్టడం లేదు. ఏ దారి లేక ప్రతిపక్షాలు, ప్రత్యర్ధులు, బాధితులు అంతా హైకోర్టుకు వెళుతుంటే.. సాంకేతిక అంశాల ఆధారంగా ఆదేశాలు ఇస్తోంది ఉన్నత న్యాయస్థానం. కాని దానికి రాజకీయాన్ని ఆపాదిస్తూ.. దారుణంగా గేమ్ ఆడుతోంది వైసీపీ. మరి ఇది ఎంత దూరం వెళుతుందో.. చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.