వైసీపీలోకి వెళ్లేందుకు తట్టాబుట్ట సర్దుకున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆయన రాకను మంత్రి అవంతి బహిరంగంగానే వ్యతిరేకిస్తుండగా.. తాజాగా వైసీపీ శ్రేణులు కూడా నిరసనకు దిగాయి.
గంటాను వైసీపీలోకి చేర్చుకోవద్దంటూ భీమిలి నియోజకవర్గంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వీఎం పాలెం, చిన్నాపురం, తగరపు వలస జంక్షన్‌లలో గంటాకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అధిష్టానం తమ మనోభావాలని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అధికారం కోసం పార్టీలు మారే గంటాను వైసీపీలోకి చేర్చుకోవద్దంటూ డిమాండ్ చేశారు.
ఆగస్టు 14 లేదా 16న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో గంటా ఆ పార్టీలో చేరబోతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది.