– పవన్ కళ్యాణ్ కొత్త నినాదం
– కాపులు, బీసీల కాంబినేషన్ ఉండాలని అభిప్రాయం
– జనసేనానిపై వైసీపీ నేతల యుద్ధం
– ఒకరి తర్వాత ఒకరు విమర్శల దాడి
బీసీ సదస్సులో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోని బీసీ కులాలన్నీ కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదని.. ఇన్నేళ్లుగా వారిలో ఐక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కాలేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కు ఎందుకు పెరిగాయంటూ ప్రశ్నించారు. హక్కుల కంటే ముందు బీసీలంతా ఐక్యత సాధించాలని సూచించారు. బీసీల కోసం దీక్షకు సిద్ధమన్న పవన్.. జనసేన అధికారంలోకి వస్తే 50శాతం పదవులు వాళ్లకే ఇస్తామని హామీ ఇచ్చారు. “నన్ను రాజకీయంగా విమర్శించాలంటే బీసీలు.. దళితులతో తిట్టిస్తారు. ఎందుకో తెలుసా? క్షేత్రస్థాయిలో బీసీలు.. కాపులు.. దళితులు కొట్టుకోవాలని అలా చేస్తారు. ఈ పన్నాగం పన్నిన నాయకులు మాత్రం ఏ పార్టీలో ఉన్నా తిట్టుకోరు. విమర్శించుకోవటం కూడా చాలా చక్కగా విమర్శించుకుంటారు” అని వ్యాఖ్యానించారు.
పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎటాక్ మొదలుపెట్టారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పవన్ గంటకో కులం అనే వ్యక్తి అని విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచనలో పవన్ ఉన్నారని మండిపడ్డారు. నిర్దిష్టమైన లక్ష్యం ఉంటే నీతి, నిజాయతీతో పోరాడాలని హితవు పలికారు. అలా చేస్తే కనీసం ఏ 30 సంవత్సరాలకో అధికారం లభించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. అప్పటి వరకు ఏంచేసినా ప్రయోజనం ఉండదని అన్నారు.
సామాజిక న్యాయంపై చర్చకు సిద్దమా? అంటూ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదంటూ ఫైరయ్యారు. పార్టీ పెట్టిన పదేళ్లకు పవన్ కు బీసీలు గుర్తొచ్చారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు పవన్ బానిస అని వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబుతో కలిసి బీసీలకు ఇచ్చిన 125 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. బీసీలు తలెత్తుకునేలా వారి తలరాతను మార్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. ఏపీలో సామాజిక న్యాయం చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.