గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఊహించని సమస్య నివురు గప్పిన నిప్పులా వుంది. ఎప్పుడు అది బ్లాస్ట్ అవుతుందో తెలియదు. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటు పదవులు దక్కని సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. పైకి ఎవరూ ఏమీ మాట్లాడే పరిస్థితి లేకపోయినప్పటికీ ఇది ఎప్పుడు అప్పుడు బ్లాస్ట్ అయ్యేలానే వుంది. శాసనసభలో 151 స్థానాలు గెలుచుకోవడం వల్ల ప్రస్తుతం అందరూ సైలెంటుగానే ఉండాల్సిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యతిరేక గళం వినిపిస్తే.. వెను వెంటనే మరో పది గొంతులు శృతి కలపడం ఖాయం.
నిజానికి వైసీపీలో నేతలది ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన అసంతృప్తి. పార్టీ స్థాపించినప్పటి నుంచి పని చేస్తున్నవారికి, త్యాగాలు చేసినవారికి, సీనియర్ నేతలకు, హామీలు ఇచ్చినవారికి పదవులు రాలేదు. పార్టీలో దిగ్గజంలాంటి రోజాకే ఆరంభంలో ఈ సమస్య ఎదురైంది. కాకపోతే, ఫైర్‌బ్రాండ్ లాంటి రోజా ఈ అంశంపై ఎక్కడో అక్కడ నోరు జారితే అది ప్రాబ్లమ్ అవుతుందనే అంచనాతో ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టి చల్లార్చారు. ఇక మరో ముఖ్యమైన వ్యక్తి, టీడీపీలో నెంబర్ టూ లోకేష్‌నే ఓడించి నిలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డిది ఎవరికీ చెప్పుకోలేని ఇబ్బంది. ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా మంగళగిరిలో మాట్లాడుతూ ఆళ్ల రామకృష్ణా రెడ్డిని గెలిపిస్తే అతనికి మంత్రి పదవి ఇస్తానని జగన్ మాటిచ్చారు. మాటిస్తే మడమ తిప్పని నేత మంత్రివర్గం ఏర్పాటులో ఎంచేతో ఆళ్లకు హ్యాండిచ్చారు. ఇప్పుడున్న చాలామంది మంత్రులకు రెండేళ్లలో ఊస్టింగ్ ఇచ్చి కొత్తవాళ్లని తీసుకుంటారని ప్రచారంలో అయితే వుంది. ఆ విడతలో తనకు అవకాశం తప్పకుండా వస్తుందని ఆళ్ల కొంత ధీమాగా వున్నారు. ఇక, చేనేత వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఇదే మంగళగిరిలో జగన్ వాగ్దానం చేశారు. ఇంతవరకు అది ఇవ్వలేదు. ఇలాగ అనేక మందికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారు.
ఎమ్మెల్యేలు ఏదైనా పని చెబితే ప్రభుత్వంలో చేసే పరిస్థితిలేదు. చిన్నచిన్న పనులు చేయించడానికి ప్రయత్నించినా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకడం కూడా గగనమైపోయింది. తమకు తెలిసిన వారికి ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇప్పించలేని పరిస్థితి. కేవలం సాక్షిలో పనిచేసిన వారికే అవకాశాలు విస్తారంగా దొరుకుతున్నాయి. అది కూడా సొంత సంస్థలో ఆర్థిక భారం తగ్గించుకోడానికే అంటున్నారు. సాక్షిలో సీనియర్లకు ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తే.. ఆమేర సంస్థకు భారం కొంత తగ్గించవచ్చునన్నది అంతర్గత ఆలోచనగా చెబుతున్నారు. అక్కడ కొత్తవాళ్లతో సరిపెడితే పెద్దగా జీతాలు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. పైగా, కొత్త రక్తం కొత్త ఉత్సాహంతో పనిచేస్తారనే స్ట్రాటజీ ఇక్కడ వర్కవుట్ అవుతుంది.
ఇక శాసనసభ్యులెవరూ మరీ ఆబ్లిగేషన్ అనుకునే ఒకరిద్దరు ఉద్యోగులను బదిలీ కూడా చేయించలేని స్థితిలో ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే, పరిస్థితి ఇలా తయారైందేంటని వారు లోలోన బాధపడుతున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏమిటన్న భావన వారిలో మొదలైంది. మొదటి నుంచి మంత్రి పదవి ఆశించిన సీనియర్ నేతలు బయటకు ఏమీ మాట్లాడలేక లోలోపల మధనపడుతున్నారు.
ఇక మంత్రి పదవులు వచ్చినవారి పరిస్థితి ఏమైనా మెరుగ్గా ఉందా? అంటే అదీలేదు. సామాజిక వర్గాలకు సమ న్యాయం పేరుతో అయిదుగురికి ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. వారంతట వారు ఏవిధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని వారే బాహాటంగా చెబుతున్నారు. కనీసం తమకు కావలసినవారిని పీఏలుగా నియమించుకునే అవకాశం కూడా లేదు. పీఏలను కూడా పార్టీకి సంబంధించిన వారే నియమిస్తున్నారు. ఉత్సవ విగ్రహాలులాగా వారు ఉన్నారు. పదవి పొందిన ఆనందం వారిలో కనిపించడం లేదు.
ఎంపీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారు ఏ కేంద్ర మంత్రినీ కలవడానికి వీలులేదని తెలుస్తోంది. ప్రధానమంత్రిని కలిసే అవకాశం వున్నా అసలే కుదరదు. ఒక వేళ కలవవలసిన అవసరం వస్తే ముందుగా అనుమతి తీసుకోవాలి. ఈ రకమైన ఆంక్షలు వారిపై ఉన్నాయని సమాచారం. గత నెలలో సీఎం ఢిల్లీ పర్యటనలో ఒక్క ప్రధానిని కలిసినప్పుడు మాత్రమే ఎంపీలందరిని వెంటబెట్టుకొని వెళ్లారు. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు తమ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు, ముగ్గురిని మాత్రమే వెంటబెట్టుకొని వెళ్లారు. అంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రజాప్రతినిధులు అందరిపైన పార్టీ వర్గాల నిఘా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి నుంచి ఢిల్లీ వరకు వారు ఏ రోజు ఎవరిని కలిసినా అధిష్టానానికి తెలిసిపోతుంది. వెంటనే హెచ్చరికలు కూడా జారీ అవుతాయి. ఈ పరిస్థితులలో వారిలో లోలోపల రగులుతున్నఈ అసంతృప్తి ఎప్పుడైనా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది.