ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కల్లోలం రేపుతోంది. నిన్నే ఈ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ నిర్ధారణ కాగా.. . తాజాగా ప్రకాశం జిల్లాకే చెందిన మంత్రి వైరస్ బారినపడ్డారు. అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది.
కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న బాలినేని.. ఇటీవలే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తొలుత రిజల్ట్ నెగిటివ్‌గా వచ్చింది. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.
అడుగుపెడితే కరోనా టెస్టు.. ఊళ్లోకి వెళ్తే క్వారంటైన్ .. మండలానికో అంబులెన్స్ .. గొప్ప ట్రీట్‌మెంట్ అని ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ.... రాష్ట్రంలో కేసులు మాత్రం రేసు పెట్టినట్టుగా దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా ఇటీవల వరుసగా ఈ వైరస్ బారినపడటం చర్చనీయాంశంగా మారింది.