రాజధాని రైతుల ధర్నాపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో జగన్ నిర్ణయానికి ఎవరైనా జై కొడతారు..కానీ రాజధానిలో ఉన్న ఎనిమిది ఊరోళ్లు మాత్రం లింగులింగుమంటూ ధర్నాలు చేస్తున్నారన్నారు వైసీపీ నేత ధర్మాన ప్రసాద్. రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తున్న ధర్నాలు బోగస్ అని, ధర్నా చేస్తున్నవారంతా టీడీపీ కార్యకర్తలని ఆరోపించారు ధర్మాన. దిక్కు మొక్కు లేకుండా 70 సంవత్సరాల నుంచి కనీసం తాగటానికి కూడా నీళ్లు లేక ఉత్తరాంధ్ర వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాకు లేని పోరాటాలు మీకెందుకని రాజధాని రైతులను ప్రశ్నించారు. ఏదో ప్రత్రికల్లో ఫోటోలు పడుతున్నాయని వాటిని చూసి ధర్నాలు, ఆందోళనలు చెయ్యటం సరికాదంటూ ధర్మాన చెప్పుకొచ్చారు. రాజధాని రైతులు బోగస్ ధర్నాలు మానుకోవాలన్నారు.