ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అందులోనూ వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉండొచ్చని గురువారం నుంచి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశానంటూ తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మేకపాటి. పార్టీ చెప్పినట్టుగానే తాను వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకే ఓటు వేశానని తేల్చి చెప్పారు.
తాను ఓటు వేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ను కూడా కలిసి వచ్చానని తెలిపారు. తాను వేసిన ఓటుతోనే వెంకటరమణ గెలిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేసి, జగన్ కుటుంబం కోసం వచ్చినవాడినని మేకపాటి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, ఇవ్వకపోతే లేదని అన్నారు.
ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఫ్లెక్సీలను తాను తొలగిస్తున్నాననే తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జగన్ ఫ్లెక్సీలను అధికారులు తొలగించారని.. ఆ వీడియోలను వాడుకుంటూ కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా తమ పార్టీ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.