తనపై దాడి చేసేందుకు చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడిన రోజా చంద్రబాబు వైఖరిపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర ఎవరికోసం చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమపాలనను చంద్రబాబు జీర్ణించుకోలేక, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అందుకే జనచైతన్యయాత్ర పేరుతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
అమరావతిలో చంద్రబాబు అండ్ కో భూములు దోచుకున్నారు. తన సామాజికవర్గం కోసమే అమరావతి నిర్మాణం చేశారని ఆరోపించారు. అమరావతి రైతులెవరూ నష్టపోకుండా జగన్ చూసుకుంటారని హామీ ఇచ్చారు. సిఆర్డిఏ అంటే చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజెన్సీ అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబును నాటి మంత్రులు నిలదీయాలన్నారు. ఐటి దాడుల నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే యాత్ర చేస్తున్నారని, ప్రజలకు మీ ఛానల్స్ లో గ్రాఫిక్స్ చూపించి మభ్యపుచ్చారంటూ తెలిపారు.
రాజధాని ప్రాంతంలో రెండు నియోజకవర్గాలలో టిడిపిని ప్రజలు ఓడించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా గుర్తు చేశారు. ప్రతి దానికి దాడి పరిష్కారం కాదని, అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందనే భయంతో చంద్రబాబు ఇలా చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాజధాని రైతులకు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఎన్నికల్లో ఓడిపోయాక చిన్నమెదడు చితికిపోయి ఏది బడితే అది మాట్లాడుతున్నారన్నారు.