ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు సైతం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు చెప్పిన ఎమ్మెల్యే… ఓటు మాత్రం సైకిల్ గుర్తుపై వేయాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో జడ్పిటీసీ అభ్యర్థిని కొరిపల్లి జయలక్ష్మి, ఎంపీపీ అభ్యర్థిని గంట శ్రీలక్ష్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు మీ ముందుకు వచ్చారని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి వారిని గెలిపించాలని అన్నారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు.
తర్వాత తేరుకున్న ఎమ్మెల్యే ఫ్యాన్ గుర్తుపై ఓటేయ్యాలని కోరారు.