గణేష్ నవరాత్రుల హడావుడిలో వైసీపీ నేతల ఫైటింగ్ పెద్దగా హైలెట్ కాలేదు. మూడు రోజులుగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య నవ్వా నేనా అన్నట్లు డైలాగ్ వార్ నడుస్తోంది. ఒకరికొకరు సీరియస్ వార్నింగులే ఇచ్చుకుంటున్నారు. ఒకే పార్టీ నేతలు ఇలా మాటల తూటాలు పేల్చుతుండడంతో జిల్లావ్యాప్తంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.
గొడవకు కారణాలేంటి..?
కొద్ది రోజుల క్రితం ఓ లెక్చరర్ పై కొంతమంది దాడి చేశారు. వారంతా ఎమ్మెల్యే రాజా అనచరులనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే భరత్ లెక్చరర్ ను కలిసి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇక్కడే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వార్ స్టార్ట్ అయింది. భరత్ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని తిడుతూ దాడులు కరెక్ట్ కాదన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు మంచిది కాదంటూ రాజాను టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే రాజా సంచలన వ్యాఖ్యలు
భరత్ కామెంట్స్ తో రగిలిపోయిన రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ను గతంలో ఇబ్బంది పెట్టిన మాజీ ఐపీఎస్ లక్ష్మినారాయణతో ఆయన సెల్ఫీలు తీసుకున్నారని.. ఎందుకు కలిశారని ప్రశ్నించారు. రౌడీ షీటర్లు భూ కబ్జాదారులు భరత్ వెనుక ఉన్నారని ఆరోపించారు రాజా.
ఎంపీ భరత్ రియాక్షన్
సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై భరత్ వివరణ ఇచ్చారు. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. లక్ష్మినారాయణను ఓ సమావేశంలో కలిసిన మాట వాస్తవమేనని.. తాను సెల్ఫీలు తీసుకోలేదని చెప్పారు. దానికి సంబంధించిన వీడియో చూస్తే అర్థం అవుతుందని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కై తనపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు భరత్.
Advertisements
మొత్తానికి ఒకే గూటికి చెందిన నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరడంతో ఇది ఎటు దారితీస్తుందోనని వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన కనిపిస్తోంది. అధిష్టానం ఈ విషయంలో కలగజేసుకుని వివాదం సద్దుమణిగేలా చూడాలని.. లేకపోతే జిల్లాలో పార్టీకి నష్టం తప్పదని భయపడుతున్నారు.