రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు స్పందించారు. రాజధాని ప్రజలను నమ్మించి మోసం చేశారని ,ఇది హత్యకన్నా దారుణం అంటూ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇది ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహం, నయ వంచన, తడి గుడ్డతో గొంతు కోయడమని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానులనేదే మోసమని, ఒకటే రాజధాని అని.. ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారని నర్సాపురం ఎంపీ చెప్పారు.
న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని చెప్పారు. అమరావతి రైతులకు తోడుగా రాష్ట్ర ప్రజలందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని రఘురామరాజు వ్యాఖ్యానించారు.