ఫీల్ మై లవ్ అంటూ ఆర్యలా మారిపోయాడాయన. నా ప్రేమను కోపంగానో.. శాపంగానో ఫీలవమని తెగ బతిమాలుకున్నాడు. కాదంటే వేరేవాళ్లని చూసుకుంటా అంటూ కాస్త బెదిరింపు ధోరణిలో చెప్పాడు. ఆ లవర్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అయితే.. ఫీలవ్వాల్సిన ఆయన జగన్మోహన్ రెడ్డి. రోజూ రచ్చబండ పేరుతో పంచ్ ల మీద పంచ్ లు విసురుతున్న రాజుగారు.. ఈరోజు ఈ పంచ్ విసిరారు. అంతే కాదు.. జగన్ గారూ మీకు సినిమాలంటే ఇష్టమని తెలుసు.. కాని మీ చుట్టూ నిజజీవితంలో నటించేవాళ్లు ఉన్నారు.. వాళ్లని నమ్మకండి అంటూ .. మీ మంచి కోసమే చెబుతున్నానంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
అరిటాకులు కోసుకునేవాడినని ఓ ఎంపీ చెబితే షాకయ్యానని రాజుగారు చెప్పుకొచ్చారు. అది కూడా యాక్షన్ చేసి మరీ చూపించారు.. ఆయన పేరు చెప్పలేదు గాని.. మనకు అర్ధమైపోయింది ఆయనెవరో. ఆయనే నందిగం సురేష్.. బాపట్ల ఎంపీ. అరిటాకులు కోసుకున్నాను.. కొబ్బరికాయలు అమ్ముకున్నాను అంటూ కబుర్లు చెబుతాడే గాని.. ఆయన ఎక్కడ ఏ దందా చేశాడో.. ఏ సెటిల్ మెంట్ లో ఎంత సంపాదించాడో మాత్రం చెప్పడు కదా. అలాంటివాళ్లంతా జగన్ చుట్టూ చేరారని.. వాళ్లని ఆయన నమ్ముతున్నాడని.. రాజుగారు ఆవేదన వెలిబుచ్చారు.
ఇక్కడ రఘురామకృష్ణంరాజు పరోక్షంగా చెప్పిన విషయం ఏంటంటే… జగన్ తో సహా అందరూ డ్రామాలు వేస్తున్నారని.. ఎవడూ సరైనోడు లేడని. పైకి చెప్పే కబుర్లు వేరు.. అసలు కేరెక్టర్లు వేరని చెప్పకనే చెప్పారు. నన్నేమీ పీకలేరన్నంత స్థాయిలో నిన్న ఎంపీగారు వైసీపీని ఛాలెంజ్ చేశారు. నేడు వారిపై సెటైర్లు వేశారు. రోజుకో రకంగా వైసీపీని, అధినేత జగన్ ను అవమానపరుస్తూ.. ఆయన చుట్టూ ఉన్నవారు అంటూ పేర్లు చెప్పకుండానే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల ఇలా అందరినీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటే.. ఏం చేయలేకపోతున్నారు. ఆ కోపంతోనే పార్టీ పార్లమెంటరీ కమిటీ మీటింగుకు పిలవలేదు. కాని అదే ఇప్పుడు రాజుగారికి కలిసొచ్చింది.
రెండు రోజుల క్రితం ఆవేశపడ్డ రఘురామకృష్ణంరాజు.. నేడు మాత్రం నవ్వుతూ తుళ్లుతూ.. సెటైర్లు వేస్తూ… ఆయా వైసీపీ ఎంపీలు ఎలా చెబుతారో యాక్ట్ చేసి మరీ చూపిస్తూ… అందరినీ నవ్వించారు. ఆయనను వైసీపీ సస్పెండ్ చేయలేదని.. ఆయన ఎంపీ పదవికి ఏమీ కాదనే క్లారిటీ వచ్చినట్లుందని.. అందుకే రఘురామకృష్ణంరాజు అంత ఉత్సాహంగా, ఉల్లాసంగా కనపడుతున్నారనే కామెంట్లు వినపడుతున్నాయి.