ఢిల్లీ: దేశ రాజధానిలో విజయసాయిరెడ్డికి వున్న పవరే వేరు. ఢిల్లీలో ఆయన హవా ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఎంత నడుస్తోందంటే.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇంటికి ఎదురుగానే ఇల్లు సంపాదించేంత.
వైసీపీ రాజ్యసభ సభ్యుని హోదాలోనే కాకుండా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వున్నవిజయసాయిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక ప్రముఖులు నివసించే తిలక్ రోడ్‌లో నివాసం కేటాయించింది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నివాసానికి ముందే ఇల్లు సంపాదించడం ఢిల్లీలో విజయసాయిరెడ్డికి గల పరపతికి నిదర్శనం.
ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పదవిని దక్కించుకునే విషయంలో కూడా విజయసాయిరెడ్డికి కేంద్రంలో తన పరపతి, ముఖ్యంగా పీఎంవోలో గల లాబీయింగ్ బాగా అక్కరకొచ్చిందని అప్పట్లో చెప్పుకున్నారు. కేవలం ఆయన కోసమే అన్నట్టుగా కేంద్రం లాభదాయక పదవుల ఆర్డినెన్స్ జారీచేసిందనే ప్రచారం కూడా జరిగింది. అంతకుముందు ఆ పదవిలో విజయసాయిరెడ్డిని నియమించిన కొద్దిరోజులకే ఆ నియామకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కేంద్రం ఆర్డినెన్స్‌తో వైసీపీ నేతకు మార్గం సుగమంగా మారి మళ్లీ ఆ పదవి దక్కింది.
ఇప్పుడు ఏకంగా రాహుల్‌గాంధీ ఇంటి ముందుకే చేరి విజయసాయి మరింత పెద్దమనిషిగా మారిపోయాడని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకప్పుడు జగన్‌మోహన్‌రెడ్డికి రాహుల్ సహా కాంగ్రెస్ నేతల నుంచి ఎదురైన అవమానాలు, పార్టీ నుంచి బయటికి రావడాలు గుర్తుచేసుకుని వైసీపీ నేతలు ఇప్పుడు కాంగ్రెెస్ నేత ఇంటి ఎదుటే విజయసాయిరెడ్డి స్థానం సంపాదించడం టిట్ ఫర్ టాట్ అని ఘనంగా చెప్పుకుంటున్నారు.