నందమూరి తారకరత్న మరణాన్ని ఆయన కుటుంబసభ్యులు.. అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత హఠాత్తుగా తారకరత్న మరణం సంభవించడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయన ఇంటికి చేరుకుని తారకరత్న పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
బాలకృష్ణ చెప్పిన సమయానికే తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు ఎంపీ విజయసాయి రెడ్డి. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తనదేనని ఎమ్మెల్యే బాలకృష్ణ తనకు మాటిచ్చారని చెప్పారు. తారకరత్న మరణం తనను ఎంతగానో బాధించిందని.. సినీ రంగంలో ప్రతిఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని గుర్తు చేశారు.
సోమావారం మధ్యాహ్నం 3 గంటలకు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తన భర్త మృతితో అలేఖ్య రెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని.. తారకరత్న మరణాన్ని అలేఖ్య జీర్ణించుకోలేకపోతుందన్నారు. రేపు ఉదంయ 9 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ కు తారకరత్న భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం తీసుకువస్తారని చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 3 గంట తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.
కాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. విజయసాయి రెడ్డికి స్వయానా మరదలి కూతురు అవుతుంది. విజయసాయి రెడ్డి భార్య, తారకరత్న భార్య తల్లి స్వయానా అక్కాచెల్లెళ్లు. అలేఖ్య రెడ్డి విజయసాయి రెడ్డికి కూతురు వరుస అవుతుంది. అందుకే ఆదివారం ఉదయం నుంచి విజయసాయి రెడ్డి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు.