పైత్యం, పెత్తనం, ప్రభుత్వం – చూడడానికి ఒకేలా అనిపించే పదాలు. ఈ మధ్య ఇవి కలిపి వాడొచ్చేమో అని అనిపిస్తోంది. ప్రభుత్వం మనదయితే పెత్తనం ఎంతయినా చెయ్యొచ్చు…అది పైత్యంగా కూడా మారొచ్చు.
మొన్న యాదాద్రి, నాగార్జునసాగర్ గుళ్ళలో కేసీఆర్ బొమ్మలు చెక్కించుకోవడం చూసి ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఆ వార్తను తలదన్నే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అదే వైసీపీ రంగుల శ్మశానం.
పల్నాడులో ఒక శ్మశానానికి వైసీపీ రంగులు వేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు. శ్మశానం గోడలకి, పక్కన వున్న చిన్న గదికి, ఎంట్రన్స్ ఆర్చ్‌కి కూడా వైసీపీ రంగులు అద్దారు. ఇది ఎవరయినా ఆదేశిస్తే చేశారా, లేక మొన్న యాదాద్రిలోలా “ప్రేమతో” అక్కడున్నవారే చేశారా అనేది తెలియాల్సిఉంది.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ “శ్మశాన వాటికను కూడా వదిలి పెట్టరా…” అంటూ ట్విట్టర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు.
ఇది ప్రభుత్వాల నిర్వాకమో, లేక కింద స్థాయి అధికారుల, అనుచరుల అత్యుత్సాహమే తెలియదు కానీ, ఇలాంటి చర్యలవల్ల నవ్వులపాలు మాత్రం అవుతున్నారని పార్టీ పెద్దలు గుర్తించాలి.