గుంటూరు జిల్లా ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం, వైసీపీ నేతలపై అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ పై జగన్ బ్యాచ్ భగ్గుమన్నారు. చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
గురువారం గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో కోడెల శివప్రసాదరావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పనికిమాలినోళ్లు పాలిస్తున్నారని.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆరోపించారు. సీఎం మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా..? చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేసేవాడిని అలా అనక ఇంకేమంటారంటూ పరుష పదజాలాన్ని వాడారు. తనపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారు అయ్యన్నపాత్రుడు.
అయ్యన్న కామెంట్స్ పై వైసీపీ నిరసనకు దిగింది. ఎమ్మెల్యే జోగి రమేష్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు చూశారు. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలకు విషయం తెలిసి అక్కడకు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు నినాదాలతో తోపులాట జరిగింది. పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో లాఠీఛార్జ్ కూడా చేశారు. ఈ క్రమంలో బుద్దా వెంకన్న సొమ్మసిల్లి పడిపోగా.. ఎమ్మెల్యే జోగి రమేష్ కారు అద్దం ధ్వంసమైంది.