– ఆర్ కృష్ణయ్యకు జాక్ పాట్
– వైసీపీ నుంచి రాజ్యసభకు ఆఫర్
– ఈ విషయంలో కేసీఆర్ చక్రం తిప్పారా?
– బీసీల ఓట్ల కోసం జగన్, కేసీఆర్ ప్లాన్ చేశారా?
– తొలివెలుగుతో కీలక విషయాలు వెల్లడించిన కృష్ణయ్య
కేసీఆర్ అనుకున్నది సాధించారా? బీసీల ఓట్లను తన దగ్గరే ఉంచుకునే ప్లాన్ చేశారా? ఆర్ కృష్ణయ్యను వైసీపీ నుంచి రాజ్యసభకు పంపి.. అటు జగన్, ఇటు కేసీఆర్ లబ్ధి పొందే వ్యూహం రచించారా? అంటే అవుననే సమాధానం రాజకీయ పండితుల నుంచి వినిపిస్తోంది. ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు కృష్ణయ్యకు ఆహ్వానం అందింది. దీనిపై ఆయన్ను తొలివెలుగు సంప్రదించగా.. కీలక విషయాలు వెల్లడించారు.
బీసీలకు తాను చేస్తున్న సేవలను గుర్తించి జగన్ రాజ్యసభ ఆఫర్ చేశారని అన్నారు ఆర్ కృష్ణయ్య. సజ్జల రామకృష్ణ ఫోన్ చేశారని.. తన పోరాటం బీసీ బిల్లు కోసమే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేసీఆర్ చక్రం తిప్పారా? అని ప్రశ్నించగా.. నవ్వుతూ తనకు ఆ విషయాలేవీ తెలియవని దాటేశారు.
నిజానికి కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ అనుకున్నారనే వార్తలు వచ్చాయి. కానీ.. ఇక్కడ నుంచి కుదరకపోవడంతో మిత్రుడు జగన్ ను సంప్రదించి.. వైసీపీ నుంచి పంపుతున్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. దీనిపై కృష్ణయ్యను తొలివెలుగు అడగ్గా.. తెలుగు రాష్ట్రాల్లో బీసీల కోసం ఎన్నో చేశానని.. గురుకుల పాఠశాలలు, రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇలా ఎన్నో విషయాల్లో పోరాటం సాగించానని చెప్పారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ తో బంధాన్ని పెంచుకుంటారా? అని ప్రశ్నించగా.. బీసీల కోసం ఎవరైతే పాటుపడతారో వారితో కలిసి ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.
ఆర్ కృష్ణయ్య తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. గతంలో తెలంగాణలోని ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తున్నారు. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి ఆర్ కృష్ణయ్యకు కేటాయించారు.