బుధవారం ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది సేపటికే గొడవ మొదలైంది. స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. వారికి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జత కలిశారు. సభలో నిలబడి నాన్‌స్టాప్‌గా నిరసన తెలిపారు. అంతాకలిసి నినాదాలతో హోరెత్తించారు.
కట్ చేస్తే.. 12 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని సభ నుంచి బహిష్కరించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల, నిమ్మలను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్. మిగతా టీడీపీ సభ్యులపై ఒకరోజు వేటు పడింది. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరితే తనను సభ నుంచి సస్పెండ్ చేయడమేంటని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశ్నించారు. సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించిన తర్వాత ఆయన పోడియం దగ్గర ఆందోళన చేశారు. దౌర్జన్యంగా తనను సస్పెండ్ చేశారని.. తాను చేసిన తప్పేంటో చెప్పాలంటూ నినాదాలు చేశారు. మార్షల్స్ అతన్ని బలవంతంగా బయటకు పంపించేశారు.
గవర్నర్ ప్రసంగంపై కొన్ని మీడియాల్లో దుష్ప్రచారం జరుగుతోందని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదనే టీడీపీ ఆరోపణలకు కౌంటర్‌గా సభలో ఓ వీడియో ప్రదర్శించారు. అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు వాటిని ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలని.. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని మంత్రి బుగ్గన స్పీకర్‌ను కోరారు.
గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా?.. చాలా సీరియస్‌గా తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ముందు వీడియో ప్రదర్శిస్తామని.. కఠిన చర్యలు ఉంటాయని స్పీకర్ స్పష్టం చేశారు.