మూడు రాజధానుల అంశంపై పట్టుదలతో ఉన్న సీఎం జగన్, వైసీపీ మండలిలో లాజికల్ గేమ్ ప్లాన్ ఆడుతున్నట్లు కనపడుతోంది. మండలి రద్దుపై కేంద్రం ఎటూ తేల్చకపోవటంతో… మండలి రూల్స్ బుక్‌లోని లాజిక్‌ను తెరపైకి తెచ్చింది. సెలక్ట్ కమిటీ, మూడు బిల్లుల వ్యవహరంపై కొత్త చర్చను తెరపైకి తెచ్చింది.
సీఆర్డీయే రద్దు బిల్లు, ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లులు సెలక్ట్ కమిటీకి తన విచక్షణాధికారంతో పంపుతున్నానని మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల కాలేదు. వైసీపీ తన పార్టీ తరుపున సభ్యుల లిస్ట్ పంపకపోగా… మిగతా పార్టీలన్నీ తమ పార్టీ సభ్యుల లిస్ట్‌ను అందజేశాయి.
అయితే, తాజాగా మండలి నాయకుడు, డిప్యూటీ సీఎం సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. మండలి ముందు బిల్లుల విషయంలో 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయని… ఆమోదించటం, వ్యతిరేకించటం, సెలక్ట్ కమిటీకి పంపటం అని… కానీ సెలక్ట్ కమిటీకి 14 రోజుల్లోనే పంపాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఇంతవరకు సెలక్ట్ కమిటీ నోటిఫై కానందున… ఇక బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని, సెలక్ట్ కమిటీయే లేదని స్పష్టం చేశారు. మండలి చైర్మన్ తనకు విచక్షణ అధికారం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడటానికి వీలు లేదని విమర్శించారు.
అయితే, సెలక్ట్ కమిటీ అంశంలో మండలి సెక్రెటరీ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్నారని, ప్రివిలేజ్ మోషన్ ఇచ్చే అంశాన్ని రెండ్రోజుల్లో పరిశీలిస్తామని టీడీపీ సభ్యుడు యనుమల ఇప్పటికే హెచ్చరించారు.
దీంతో మండలిలో లాజికల్‌గా ఆలోచిస్తూ, రూల్స్ బుక్‌ను తిరగేస్తూ… ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వైసీపీ, టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే… అభివృద్ది వికేంద్రీకరణ అంశంతో పాటు, అమరావతి అంశం, మండలిపై బుధవారం సీఎం జగన్ ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు.