గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగారు. టీడీపీ నేత బోండా ఉమా కారు అద్దాలు పగిలిపోయాయి. కేసినో వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడ చేరుకుంది. అక్కడ టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నేతలు గుడివాడకు చేరుకున్న వెంటనే వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయ్నతం చేశారు.
అక్కడున్న టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. దాడిలో బోండా ఉమ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దాడులు చేస్తే.. తెలుగుదేశం నేతలను అరెస్టులు చేయడం ఏంటి అని ప్రశ్ని్ంచారు. కాసేపు పోలీసులు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.
ఓవైపు నుంచి టీడీపీ, మరోవైపు నుంచి వైసీపీ శ్రేణులు ర్యాలీగా రావడంతో పోలీసులు నెహ్రూ చౌక్ సెంటర్ సమీపంలో టీడీపీ శ్రేణులను, ఎన్టీఆర్ స్టేడియం దారిలో వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ వివాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ ద్వారా ఖండించారు.
టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడి, సీనియర్ నేత బోండా ఉమా గారి కారుని ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుని లోకేష్ తప్పుబట్టారు. వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నా ప్రేక్షకపాత్ర పోషించడం, పార్టీ కార్యాలయంలోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే గడ్డం గ్యాంగ్ కేసినో నడిచిందనేది స్పష్టమవుతోందని నారా లోకేష్ అన్నారు.