మీరేం చేస్తున్నారయ్యా అని ప్రశ్నిస్తే.. వాడు మీ మనిషే కదా.. మమ్మల్ని అడుగుతారేంటని వైసీపీ వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. రమేష్ హాస్పిటల్స్ ఎపిసోడ్ కి ఇప్పుడు రాజకీయ రంగే కాదు.. కులం రంగు కూడా పూసుకుంది. కరోనా కట్టడిలో విఫలం అంటూ ప్రతిపక్షంగా టీడీపీ రెచ్చిపోయింది.. ఇప్పుడు వైసీపీ.. అసలు ఆ హాస్పటల్ మీ వాడిదే.. వాడు మీ పార్టీ కూడా.. మీ జూమ్ మీటింగుల్లో కూడా పాల్గొన్నాడు.. వాడిని కవర్ చేస్తున్నారా అంటూ ఎదురు రెచ్చిపోతోంది. కరోనా కట్టడిలో మొత్తం వ్యవస్ధ విఫలమైందన్న సంగతి మాత్రం ఒప్పుకోవడం లేదు. ఆ సంగతి దాచి పెట్టడానికి ఇప్పుడు చంద్రబాబుపై ఎదురుదాడి చేస్తే చాలని వైసీపీ అనుకుంటోంది.
రమేష్ ఆస్పత్రిదే తప్పని తేలితే.. ఆ ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయ్… డాక్టర్ రమేష్ బాబునే అరెస్ట్ చేయి.. ఎవరు వద్దన్నారు.. ఎవరు నీకు అడ్డం పడ్డారు? ఆ పని వదిలేసి.. వాడు మీ వాడే మీ వాడే అని అరిస్తే ఉపయోగం ఏంటి? ఆ పని చేయలేరు.. ఎందుకంటే రమేష్ ఆస్పత్రికి హోటల్ లో క్వారంటైన్ సెంటర్ నడుపుకోవడానికి పర్మిషన్ ఇఛ్చింది ఆ ప్రభుత్వమే కాబట్టి. ఆ సంగతి పక్కన పెట్టి రాజకీయ రంకెలేసి.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మనశ్శాంతి లేకుండ చేయటమే ఇదంతా.
రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో కూడా పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగాయని వైసీపీవారు ఆరోపించారు. సీఐడీ విచారణ అన్నారు.. అదన్నారు ఇదన్నారు.. అంతన్నారు ఇంతన్నారు.. ఇప్పటివరకు ఒక్కటి కూడా తేల్చలేదు. అది తేల్చలేక కాదు.. తేల్చేస్తే వారికేంటి లాభం. అందుకే .. టీడీపీ నేతలా, మాజీ మంత్రులా అనేది సంబంధం లేకుండా.. ఎవరినైనా సరే.. కేసుల సంగతులన్నీ చెప్పటం.. డబ్బులు వసూలు చేయటం.. అంతా కామన్ అయిపోయింది. రాజధానిలో కీలక పాత్ర పోషించిన ఓ మాజీ మంత్రి దగ్గర భారీగానే డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకనే సీఐడీ కేసులని హడావుడి చేసి.. తర్వాత సైలెంట్ అయిపోయారని చెప్పుకుంటున్నారు. ఈ సంగతి తెలిసి కూడా చంద్రబాబుగారు ఒక రకంగా మాట్లాడతారు.. అందుకు కౌంటర్ గా వైసీపీ నేతలు మరొకటి మాట్లాడతారు.. మధ్యలో జనాన్ని మోసం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి దగ్గర కూడా గట్టిగానే డిమాండ్ చేశారని.. అది డీల్ కుదరకే.. జైలు దాకా వెళ్లాల్సి వచ్చిందని కూడా వినపడింది.
ఇప్పుడు కూడా డాక్టర్ రమేష్ బాబు దగ్గర గట్టిగానే వసూలు చేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆయన చెల్లించాల్సిన వాళ్లకి చెల్లించేసి పక్కకు వెళ్లిపోతాడు. ఎవరి రాజకీయం వారు చేస్తారు. పాజిటివ్ ఉన్నా, నెగెటివ్ ఉన్నా.. లక్షలకు లక్షలు వసూలు చేసి.. ఆఖరికి వారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కూడా పోయినా.. కేసులు గట్టిగా నిలబడవు.. ఆస్పత్రి లైసెన్సు కూడా రద్దు అవదు.
మీడియా సైతం.. ప్రభుత్వ అనుకూల ప్రతికూల వర్గాలుగా విడిపోయి.. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ప్రభుత్వ అనుకూల మీడియానేమో.. ప్రైవేటు ఆస్పత్రుల దందా అంటూ అందుకుంటే… ప్రభుత్వ వ్యతిరేక వర్గమేమో.. ఇది ప్రభుత్వ వైఫల్యమంటూ అందుకుంది. అసలు రెండూ నిజాలే.. రెండిటిని హైలెట్ చేయాల్సినవారు.. ఎవరికనుకూలంగా వారు.. అవసరమైంది మాత్రమే హైలెట్ చేస్తున్నారు. ఆఖరికి ప్రభుత్వ ప్రతినిధులు అంతే.. ప్రతిపక్ష పార్టీ నేతలు అంతే.. అందరూ ఎవరి గొంతు వారి వినిపిస్తున్నారు. అంతేగాని.. హోటల్ లో క్వారంటైన్ సెంటర్ పెట్టాల్సిన పరిస్ధితికి తెచ్చిన ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడనివ్వరు.. ఇంతమందిని మేనేజ్ చేసి లక్షలకు లక్షలు దండుకుంటూ వ్యాపారం చేసిన ప్రైవేటు ఆస్పత్రి వ్యవహారాన్ని తేల్చరు.