మరోసారి హ్యాకర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి..దాని ప్రొఫైల్ పిక్ ను మార్చేశారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి వైసీపీ ట్విట్టర్ ఖాతాలో పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని పోస్టులు వెలువడడంతో.. ఖాతా హ్యాక్ అయినట్టు అధికారులు గుర్తించారు.
అయితే వైసీపీ ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ ను మార్చేసి.. వెంటనే హ్యాకర్లు క్రిప్టో కమ్యూనిటీ పోస్టులు పెట్టారు. బయోడేటా వివరాలను మార్చేశారు. క్రిప్టోకు సంబంధించిన పలు ట్వీట్లు, రీ ట్వీట్లు పెట్టిన హ్యాకర్లు.. ఒక రీ ట్వీట్ లో ఎలాన్ మస్క్ ఎన్ఎఫ్టీలు ఫ్రీగా ఇస్తున్నారని పేర్కొన్నారు.
ట్విట్టర్ అకౌంట్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంచేసి, బయోను మాత్రం ఎన్ ఎఫ్టీ మిలియనీర్, అమెరికా అని మార్చేశారు. ఇక ఖాతాను పునరుద్దరించేందుకు వైసీపీకి చెందిన సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.