ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకొని, తనపై ఉన్న ఐరన్ లెగ్ ముద్రను సైతం చెరపేసుకున్న నేత ఎమ్మెల్యే రోజా. నగరి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ… రోజా నియోజకవర్గంపై పూర్తిపట్టు సాధించినట్లు కనపడటం లేదు. తన పార్టీ నేతలే తనను ఓడించేందుకు పనిచేశారని గతంలో ఆరోపణలు చేయగా, ఇప్పుడు మళ్లీ అవే ఆరోపణలు ఎక్కుపెట్టారు.
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమికి కొందరు నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు. నగరి, పుత్తూరులో 14మంది రెబల్స్‌ను బరిలోకి దింపారని, రెబల్స్ గెలిచేందుకు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పంపిణీ చేశారని ఆరోపించారు. గతంలో తన ఓటమికి పనిచేసినవారే ఇప్పుడూ అదే పనిచేస్తున్నారని, వారిపై వేటు తప్పదని హెచ్చరించారు.
పంచాయితీ ఎన్నికల్లోనూ రోజాకు అసమ్మతి తప్పలేదు. నియోజకవర్గంలోని ఐదుగురు నేతలను ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే సస్పెండ్ చేశారు. వారు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. అయినా… మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే… ఆమెపై ఎంత అసంతృప్తి ఉందో అన్న చర్చ జోరందుకుంది.