పశ్చిమగోదావరి జిల్లా సోమవరప్పాడు మినీ కురుక్షేత్రాన్ని తలపించింది. టీడీపీ, వైసీపీ నేతలు సై అంటూ కాలు దువ్వారు. నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది పరిస్థితి. పోలీసులు టీడీపీ నేతలు అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఈ వివాదం చెలరేగడానికి ప్రధాన కారణం. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రోడ్ల మరమ్మతుకు పూనుకోవడమే. ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు దగ్గర రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి గుంతలను పూడ్చారు. ఆ సమయంలో కొందరు వైసీపీ నేతలు వచ్చి అడ్డుకున్నారు. ప్రభుత్వం రోడ్డు వేస్తుందని.. రూ.5 కోట్లు కూడా విడుదల చేసిందని తెలిపారు.
మరమ్మతు పనులు అయిపోయాక చింతమనేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలు గుంపుగా అక్కడకు చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే పోలీసులు టీడీపీ నేతలను సముదాయించి పంపుతుండగా.. దేనికైనా రెడీ అని అనడంతో వివాదం చెలరేగింది. ఎవరొస్తారో రండి చూసుకుందాం అంటూ వైసీపీ నేతలు సవాల్ విసిరారు. మాటా మాటా పెరగడంతో ఘర్షణకు దారితీసింది. పోలీసులు వారిని నిలువరించి.. టీడీపీ నేతలను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
వర్షంలో మట్టి తీసుకొచ్చి పోస్తే ఉంటుందా అని వైసీపీ నేతలు చింతమనేనిపై ఫైరయ్యారు. ఫోటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోడానిక ఇలాంటి పిచ్చి స్టంట్లకు దిగారని ఆరోపించారు. ఇటు టీడీపీ నేతలు కూడా ధీటైన కౌంటర్ ఇస్తున్నారు.