ఈ ఏడాది తొలి తుపాను ‘అసని’ మధ్య బంగాళాఖాతంలో మార్చి 21న ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అయితే.. ఇది తీరం దాటే అవకాశం లేదని వెల్లడించింది.
కానీ.. అండమాన్, నికోబార్ దీవుల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడినట్టు చెప్పింది. ఇది బుధవారం దక్షిణ మధ్య బంగాళాఖాతం మీద ఉన్నట్టు వివరించింది.
అల్పపీడనం మార్చి 19 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ కొంత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తర్వాత, అండమాన్ వెలుపల ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.
మార్చి 20 ఉదయం నాటికి పీడనం మరింత బలపడుతుందని, మార్చి 21న అసని తుపానుగా మారుతుందని ఐఎండీ వివరించింది.