మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్‌లో జరగబోయే ఏ ఎన్నికల్లోనూ తాను పోటీచేయబోనని వెల్లడించారు. 80 ఏండ్లు దాటినందున పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోడీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అయితే తన కుమారున్ని వారసునిగా ప్రకటించాలని కుటుంబ సభ్యుల నుంచి యడ్యూరప్పకు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు. మరో నాలుగైదు నెలల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీలో యడ్యూరప్పకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. ఆయనకు లింగాయత్ సామాజిక వర్గం నుంచి మంచి మద్దతు ఉంది.
రాష్ట్రంలో పార్టీలో ప్రస్తుతం బలమైన నేతగా ఆయన ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తన కుమారుడు బీవై విజయేంద్రను రాజకీయాల్లోకి తీసుకురావాలని యడ్యూరప్ప ఉన్నట్టు కనిపిస్తోంది. తన నియోజకవర్గం శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయేంద్రను పోటీ చేయిస్తానని ఆయన గతంలో ప్రకటించారు.