గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వాతావరణం చల్లబడుతోంది. దీంతో తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. ఈ క్రమంలో మరో నాలుగు రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులతో తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాష్ట్రంలో గురువారం వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
అలాగే, కర్ణాటక, తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఈ క్రమంలో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయంటూ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించారు.