తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర నిజామాబాద్ కు చేరుకున్నది. ఈ సందర్భంగా నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామిని మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రేవంత్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి, పాదయాత్ర బృందానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు స్వాగతం పలికారు.
ఆ ఫోటోలను కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దిల్ రాజు కాంగ్రెస్ లో చేరబోతున్నారా.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇటీవల బలగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సిరిసిల్ల జిల్లాలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ ను దిల్ రాజు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్,బీఆర్ఎస్ సర్కార్ పై దిల్ రాజు ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో అందరూ ఫ్యూచర్ లో దిల్ రాజు బీఆర్ఎస్ లో చేరబోతున్నారేమో అనుకున్నారు. అనూహ్యంగా ఇవాళ దిల్ రాజు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో ప్రత్యక్షమవ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో దిల్ రాజు పొలిటికల్ స్కెచ్ ఏంటనే దానిపై చర్చ జోరందుకుంది.మరి వీటిపై దిల్ రాజు ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.