అల్లోపతి ఓ పనికిమాలిన వైద్యం, కరోనా టీకా ఓ ఫెయిల్యూర్ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా మళ్లీ అదే వాగారు. ఈసారి కూడా అల్లోపతి వైద్యాన్ని తీవ్రంగా విమర్శించారు. అల్లోపతిని భూమిలో పాతిపెట్టాలని వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల ప్రజలు మరింత అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని రిషికుల్ ఆయుర్వేద కాలేజీలో నిర్వహించిన ఓ సెమినార్‌లో మాట్లాడారు. అదే సెమినార్‌లో ఎంబీబీఎస్ డాక్టర్లున్నా.. మీరు నా మాటలకు బాధపడొద్దు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ.. బాబా రాందేవ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన మాటలను వక్రీకరించకుండా.. అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకుంటే డాక్టర్లు సైతం తనకే మద్దతుగా నిలుస్తారంటూ వ్యాఖ్యానించారు.
“ఆయుర్వేదం ఉపయోగించి కరోనాకు మందు కనుక్కున్నాం. కానీ, ఇప్పటివరకు అల్లోపతి నుంచి కరోనా ఔషధం విడుదల కాలేదన్నారు రాందేవ్. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో 25 శాతం మందికి ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నాయి. దీనంతటికీ అల్లోపతి ఔషధాలే కారణం. అల్లోపతి మందుల వల్ల అనేక మంది కిడ్నీలు దెబ్బతిన్నాయి.
మల్టీనేషనల్ కంపెనీలు మనతో పోటీ పడేలా చేసుకున్నాం. అల్లోపతి ప్రజల్ని మరింత అనారోగ్యానికి గురిచేస్తోంది” అని అన్నారు. అల్లోపతిని భూమిలో పాతిపెట్టేయాలని, తానైతే దానికి ఊపిరి ఆడకుండా చేసేస్తానని అన్నారు.